రాజమహేంద్రవరానికి జూ పార్కు జోరు… ఈ నెల 7న న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక అధికార బృందం రానుంది.
తూర్పుగోదావరి జిల్లా **రాజమహేంద్రవరం**కు జూ పార్కు ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. నగరానికి సమీపంలోని దివాన్ చెరువు పండ్ల మార్కెట్ – గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 700 ఎకరాల అటవీ భూమిలో జూ పార్కు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ కొంతమేర చెట్లు, తుప్పలు తొలగించి స్థలాన్ని శుభ్రం చేసినట్లు సమాచారం.
జూ పార్కు ఏర్పాటుకు అవసరమైన అనుకూలతలు, మౌలిక వసతులు పరిశీలించేందుకు ఈ నెల 7న న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక అధికార బృందం రానుంది. ఈ పరిశీలనలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, స్థానిక డీఎఫ్‌వో ప్రభాకర్ తదితరులు పాల్గొననున్నారు.
రాజమహేంద్రవరం పరిసర ప్రజలకు జంతువులంటే మక్కువ కొత్తది కాదు. గతంలో మున్సిపాల్టీ ఆవరణలో జింకలు ఉండగా, వాటిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేవారు. అలాగే కడియం మండలం జేగూరుపాడులోని జీవికే విద్యుత్ కేంద్రం వద్ద కూడా ఒకప్పుడు జింకలు, ఇతర వన్యప్రాణులు సంచరించిన సందర్భాలున్నాయి. పరిశ్రమ సక్రమంగా నడవకపోవడంతో వన్యప్రాణులను అక్కడక్కడా వదిలేసిన ఘటనలూ చోటుచేసుకున్నాయి.
ఇక దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించిన ఘటనలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో జూ పార్కు ఏర్పాటు అయితే పర్యాటకానికి మరింత ఊతం, స్థానికులకు ఉపాధి అవకాశాలు, నగరానికి కొత్త గుర్తింపు లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.